బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అవమానకర ఘటన చోటుచేసుకుంది. తనిఖీల పేరుతో కొరియాకు చెందిన పర్యాటకురాలిని గ్రౌండ్ సిబ్బంది లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, జనవరి 19న ఆ మహిళ స్వదేశానికి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చింది. ఇమిగ్రేషన్ పూర్తయ్యాక టెర్మినల్ వైపు వెళ్తుండగా మొహమ్మద్ అఫాన్ అనే గ్రౌండ్ సిబ్బంది టికెట్ చెక్ పేరుతో ఆమెను ఆపాడు. చెక్-ఇన్ లగేజీ నుంచి శబ్దం వస్తోందని చెప్పి వ్యక్తిగత తనిఖీ అవసరమని పేర్కొంటూ పురుషుల వాష్‌రూమ్ సమీపానికి తీసుకెళ్లాడు. ఆమె అభ్యంతరం తెలిపినా అనుచితంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే ఆమె ఫిర్యాదు చేయగా, సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
