అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కులవర్ధన్ (30) మృతిచెందిన ఘటన సంచలనం రేపింది. కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించగా, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, గంజాయికి అలవాటుపడిన కులవర్ధన్ ఎదురింటిలో నివసించే బాలికపై దారుణానికి పాల్పడి, అనంతరం నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
నిందితుడి మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధిత అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అధికారిక వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. చిన్నారులపై దాడులపై సమాజం అప్రమత్తంగా ఉండాలని, కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
