ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురి మృతి

ఆళ్లగడ్డ, నంద్యాల నేరవార్తలు, శిరివెళ్ల, న్యూస్‌టుడే: అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపు తప్పింది. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం, నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరివెళ్లమెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ప్రమాదానంతరం మంటలు వ్యాపించగా, సమీపంగా వెళ్తున్న డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.

WhatsApp Join Now
Youtube Subscribe