దర్శకుడు వేణు యెల్దండి తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, మలుపులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒకప్పుడు కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు, బలగం సినిమాతో దర్శకుడిగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఎల్లమ్మ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
2004 నుంచి 2015 వరకు నటుడిగా బిజీగా గడిపిన వేణు, రోజుకు మూడు నాలుగు షూటింగ్‌లు, ఈవెంట్లతో తీరికలేని జీవితాన్ని గడిపానని తెలిపారు. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ తన కెరీర్‌లో కీలక మలుపుగా మారిందని చెప్పారు. మొదట తాత్కాలికంగా అనుకున్న ఆ షో అనూహ్య విజయం సాధించడంతో, మరిన్ని ఎపిసోడ్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. అయితే పేరు, డబ్బు అన్నీ ఉన్నప్పటికీ తన అసలు లక్ష్యం సినిమా కావడంతో 2015లో జబర్దస్త్‌ను విడిచిపెట్టానని చెప్పారు.
అయితే ఆ నిర్ణయంతో “టీవీ నటుడు” అనే ముద్ర పడటంతో సినిమా అవకాశాలు తగ్గాయని వేణు తెలిపారు. కొంతకాలం తీవ్ర ఆర్థిక, మానసిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, నిరుద్యోగిగా మారడం తనను బాధించిందన్నారు. అయినా సినిమా మీద నమ్మకంతో ముందుకు సాగి, చివరకు బలగంతో దర్శకుడిగా సక్సెస్ సాధించానని చెప్పారు. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మపై ఆశలు పెట్టుకున్నట్టు వెల్లడించారు.
