శుక్రవారం నాడు తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి కేశినేని శివనాధ్ గారిని వారి కార్యాలయంలో శాలువాతో సత్కరించారు. నందిగామకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ మంజూరు చేయడంలో ఎంపీ చేసిన విశేష కృషిని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు.
ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, తన కృషి ఫలితంగా 2018లోనే నందిగామలో 20 పడకల ఆయుష్ హాస్పిటల్ ప్రారంభమైందని తెలిపారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తరువాత ఆసుపత్రి అభివృద్ధి పనులు నెమ్మదించినట్లు పేర్కొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నందిగామ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ మేరకు ఆసుపత్రిని విస్తరించి 50 పడకలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదన రూపొందించి ఎంపీకి సమర్పించినట్లు వెల్లడించారు.
ఆ ప్రతిపాదనను ఎంపీ పార్లమెంట్‌లో ప్రస్తావించి సంబంధిత కేంద్ర మంత్రితో చర్చించిన అనంతరం నందిగామకు 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ కేటాయించబడినట్లు తెలియజేశారు. ప్రస్తుతం పరిపాలనా అనుమతులు లభించాయని, స్థల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, ప్రభుత్వం త్వరలో స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించనుందని ఎంపీ పేర్కొన్నట్లు తెలిపారు. అవసరమైన నిధులు కూడా త్వరలో విడుదల కానున్నాయని వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర వైద్యశాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నందిగామ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆయుష్ వైద్యసేవలు అందుబాటులోకి రానుండటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
