బొబ్బిలిలో దాతల సహకారంతో అనాధ యువకుడు చక్రపాణికి తుంటె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె.సి. రాజు తెలిపారు. బుధవారం రాత్రి శ్రీ రామచంద్ర నర్సింగ్ హోమ్‌లో ప్రముఖ ఎముకల వైద్యుడు డాక్టర్ భరత్ కుమార్ ఈ శస్త్రచికిత్సను సఫలీకృతం చేశారు. చికిత్స అనంతరం 10 రోజులపాటు విశ్రాంతి, జాగ్రత్తలు అవసరమని, ఆ తర్వాత సాధారణంగా నడవగలడని వైద్యుడు వెల్లడించారు.
ఈ సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే బేబినాయన, సత్యసాయి సేవా సమితి బొబ్బిలి, హుదా ముస్లిం వెల్ఫేర్ సంస్థతో పాటు పలువురు దాతలు మానవీయ ఆర్థిక సహకారం అందించారు. వారి స్పందనతో చికిత్స సాధ్యమైందని జె.సి. రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే బేబినాయన అందించిన స్ఫూర్తి, ధైర్యం తమకు ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.
అలాగే, రెండు రోజులపాటు సేవలు అందించిన డాన్స్ మాస్టర్ కరుణ కుమార్, అశోకమ్మ, మహాలక్ష్మి తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనే నమ్మకాన్ని ఈ ఘటన మరింత బలపరిచిందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
