తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద అంశాలపై సమగ్ర విచారణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్‌కుమార్‌ను నియమించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల్లో చోటుచేసుకున్న పరిపాలనా లోపాలు, టెండర్ ప్రక్రియలో జరిగిన లోటుపాట్లపై కమిషన్ లోతైన అధ్యయనం చేయనుంది.
ప్రత్యేకంగా టీటీడీలో నెయ్యి కొనుగోలు టెండర్ విధానం, అమలు దశలో అనుసరించిన విధివిధానాలు, నాణ్యత నియంత్రణ వ్యవస్థలపై కమిషన్ దృష్టి సారించనుంది. సరఫరా ప్రక్రియలో ఏవైనా అవకతవకలు, నిర్లక్ష్యాలు చోటుచేసుకున్నాయా అనే అంశాలను కూడా పరిశీలించనుంది. సంబంధిత అధికారుల బాధ్యతలు, నిర్ణయాల సరళిపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది.
ఏకసభ్య కమిషన్ తన నివేదికను 45 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తిరుమల వంటి పవిత్రక్షేత్రానికి సంబంధించిన అంశం కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతనిస్తూ పారదర్శక విచారణకు శ్రీకారం చుట్టింది.
