తిరుమల కల్తీ నెయ్యి వివాదం నుంచి దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్‌పై వైసీపీ దుష్ప్రచారం: పల్లా శ్రీనివాసరావు

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు సీబీఐ నివేదికల్లో తేలిన నేపథ్యంలో, గత వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే దారి మళ్లింపు రాజకీయాలకు దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఘాటుగా విమర్శించారు. కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీకైన ప్రసాదంపై అనుమానాలు తలెత్తేలా చేసిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.

సీబీఐ నివేదిక వెలుగులోకి వచ్చిన తరువాత బాధ్యత వహించాల్సిన నాయకత్వం, తమకే తామే ‘క్లీన్ చిట్’ ఇచ్చుకున్నట్టు ప్రచారం చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని పల్లా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భక్తులు, మతపెద్దలు తీవ్రంగా స్పందించడంతో అసలు విషయాలు చర్చకు వచ్చినట్టు తెలిపారు.

కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు బయటపడుతున్న క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను వివాదంలోకి లాగారని పల్లా ఆరోపించారు. తిరుమల దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలూ చూపించలేకపోయారని స్పష్టం చేశారు.

హెరిటేజ్‌పై పరువు నష్టం కలిగించే కథనాల విషయంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని సంబంధిత కంటెంట్ తొలగించాలని ఆదేశించడం గమనార్హమన్నారు. తప్పుడు ఆరోపణలు చట్టపరంగా నిలవవన్నది స్పష్టమైందని పేర్కొన్నారు.

మూడు దశాబ్దాల నిష్కళంక చరిత్ర కలిగిన హెరిటేజ్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలను సహించబోమని పల్లా హెచ్చరించారు. అసత్య ప్రచారానికి చట్టపరమైన సమాధానం తప్పదని, నిజాలు వెలుగులోకి వచ్చి బాధ్యులు శిక్షించబడతారని తేల్చిచెప్పారు.

WhatsApp Join Now
Youtube Subscribe