తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో నూతనంగా స్థాపించబడిన ‘యుక్తా క్రియేషన్స్’ సంస్థ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియో సభ్యుడు, తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సంస్థను లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన నిర్వహించి సంస్థ సేవలను ప్రారంభించారు. యుక్తా క్రియేషన్స్ మెడల్స్, మెమెంటోలు, ట్రోఫీల తయారీ మరియు సరఫరాలో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో యువత కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభించడం శుభపరిణామమని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినూత్న సేవలు అందిస్తూ సంస్థ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. నగరంలో స్థానిక సంస్థలు ఎదగడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, భవిష్యత్తులో ‘యుక్తా క్రియేషన్స్’ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, స్థానిక నేతలు, ప్రముఖులు మరియు కాలనీ వాసులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.
