- సంక్రాంతి పర్వదినాన పెద్దలను స్మరించుకున్న టీడీపీ రాష్ట్ర నేత
- మాచినేని సిద్ధయ్య సమాధి వద్ద నివాళులర్పించిన విశ్వేశ్వర నాయుడు
- స్వగ్రామంలో ఆత్మీయ పలకరింపులు.. పండుగ సంబరాల్లో నేతలు
చిట్వేలి, జనవరి 15: ఎల్లో సింగం ప్రతినిధి
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు తన స్వగ్రామమైన చిట్వేలి మండలం, నగిరిపాడు పంచాయతీ పరిధిలోని మల్లెంపల్లి లో పర్యటించారు. ప్రతి ఏటా ఆనవాయితీగా పెద్దలను స్మరించుకునే క్రమంలో భాగంగా, గురువారం తన తల్లిదండ్రుల సమాధుల వద్ద ఆయన ఘన నివాళులర్పించారు.సంక్రాంతి పండుగ వేళ పితృదేవతలను స్మరించుకోవడం మన సంప్రదాయమని భావించే కస్తూరి విశ్వనాథ నాయుడు గారు, తన తండ్రి కీ.శే. యానాదయ్య, తల్లి కీ.శే. లక్ష్మమ్మ గార్ల సమాధుల వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పూల జల్లులు కురిపించారు. వారి సేవలను స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించి, పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.అదేవిధంగా మల్లెంపల్లి గ్రామంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు తన తండ్రి కీ.శే. సిద్దయ్య స్మరించుకుంటూ వారి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామానికి చెందిన ప్రముఖ నేతలందరూ ఒకేసారి తమ పూర్వీకులకు నివాళులు అర్పించడం గ్రామస్థులను ఆకట్టుకుంది.
అనంతరం మాచినేని విశ్వేశ్వర నాయుడు ఆహ్వానం మేరకు కస్తూరి విశ్వనాథ నాయుడు వారి స్వగృహానికి విచ్చేశారు. పండుగ పూట తన సొంత గ్రామంలోని పెద్దలను, చిన్నలను పేరుపేరునా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి పండుగ విందులో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గ్రామస్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో మల్లెంపల్లి గ్రామ ప్రముఖులు, కార్యకర్తలు మరియు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
