విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడకు చెందిన టి. ప్రణవి శ్రీలక్ష్మి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.54 పర్సంటైల్ సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక కొమ్మాది బీటీఎస్ అపార్టుమెంట్‌లో నివసిస్తున్న ప్రణవి, విద్యా రంగంలో తన ప్రతిభతో కుటుంబానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఆమె తండ్రి టి.ఎన్.ఎస్. శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి విలేఖరిగా సేవలందిస్తుండగా, తల్లి జ్యోతి ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రణవి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎదగడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాన్ని సాధించానని పేర్కొన్నారు.
ప్రణవి సాధించిన ఈ ఫలితంపై స్థానికులు, ఉపాధ్యాయులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రణవి విజయం ప్రేరణగా నిలుస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు.
