జలదంకిలో జానకి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం – వైభవంగా ధ్వజారోహణం

జలదంకి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన జలదంకిలోని శ్రీ గంగా పార్వతి సమేత జానకి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కుందుర్తి సతీష్ శర్మ ఆధ్వర్యంలో భక్తి, శ్రద్ధల మధ్య ఈ పుణ్యకార్యం జరిగింది. ముందుగా స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించి, కలశస్థాపన చేశారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి, పవిత్ర జలాలతో ధ్వజస్తంభాన్ని శుద్ధి చేశారు.

పంచామృతాలతో ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి, అగ్ని, గాలి తదితర పంచభూతాల ప్రతీకగా అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. మంగళ వాయిద్యాల నాదం, “హర హర శంభో శంకర” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చక బృందం ధ్వజస్తంభం చుట్టూ దర్భను చుట్టిన అనంతరం, నందీశ్వరుని చిత్రపటాన్ని ధ్వజస్తంభ శిఖరభాగాన ప్రతిష్టించారు. తదుపరి ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ పులుగుంట మధుమోహన్ రెడ్డి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కూరపాటి దయాకర్ రెడ్డిలు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

WhatsApp Join Now
Youtube Subscribe