-రేపటిలోగా ‘అక్షర ఆంధ్ర’ సర్వే పూర్తి కావాలి.. వెల్ఫేర్ అసిస్టెంట్లకు డెడ్ లైన్
-యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వెనుకబాటుపై అసహనం.. తక్షణమే పూర్తి చేయాలని ఆదేశం
-ఈనెల 15 లోపు వంద శాతం ఇంటి పన్నుల వసూలు చేయాలి: అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
చిట్వేల్, ఫిబ్రవరి 04: ఎల్లో సింగం ప్రతినిధి
మండల పరిధిలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ సర్వేలు మరియు పన్నుల వసూళ్ల ప్రక్రియపై తిరుపతి జిల్లా స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డ్ అధికారి బుధవారం చిట్వేల్ మండలంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మండల అభివృద్ధి అధికారి ఉప మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మరియు స్వర్ణ గ్రామ సిబ్బందితో కలిసి ఆయన క్షేత్రస్థాయి పురోగతిపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.
-సర్వేల జాప్యంపై ఆగ్రహం:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రగతిపై సమీక్షించగా, కొన్ని ప్రాంతాల్లో ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉండటంపై అధికారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వేలో వెనుకబడిన సిబ్బంది తక్షణమే లక్ష్యాలను పూర్తి చేయాలని, ఇప్పటివరకు పనులు ప్రారంభించని వారు యుద్ధప్రాతిపదికన సర్వే పూర్తి చేయాలని హెచ్చరించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
-అక్షర ఆంధ్రపై హెచ్చరిక:
ముఖ్యంగా ‘అక్షర ఆంధ్ర’ సర్వే పెండింగ్‌లో ఉండటంపై వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్‌ను అధికారి ప్రశ్నించారు. (గురువారం) ఈ సర్వేను నూటికి నూరు శాతం పూర్తి చేయాలని, గడువు ముగిసిన తర్వాత కూడా పెండింగ్‌లో ఉంటే సంబంధిత సిబ్బందిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిజిటల్ డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని సూచించారు.
-పన్నుల వసూళ్లకు గడువు:
పంచాయతీల ఆర్థిక పురోభివృద్ధికి కీలకమైన ఇంటి పన్నుల వసూళ్లపై ఉప మండల అభివృద్ధి అధికారులు మరియు పంచాయతీ అభివృద్ధి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 15వ తేదీలోపు ప్రజల సహకారంతో పూర్తి స్థాయిలో పన్నుల వసూళ్లు పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, మండల స్థాయి అధికారులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు మరియు స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.
