విద్య నేటి కాలంలో అత్యంత ఖరీదైన వస్తువుగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్కేజీ నుంచే లక్షల రూపాయలు ఫీజుల పేరుతో వసూలు చేస్తుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ అరకొరగా ఉండడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫీజులతో పాటు జాతీయ దినాలు, ప్రత్యేక కార్యక్రమాల పేర్లతో అదనపు భారం మోపుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫార్ములు వంటి అవసరాలన్నీ పాఠశాలలలోనే కొనాల్సి రావడం మరో సమస్యగా మారింది. పుస్తకాల బరువు కన్నా నోట్ల కట్టల బరువు ఎక్కువైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
భవిష్యత్తు కోసం భారీ ఫీజులు కట్టాల్సి రావడంతో అనేక మధ్యతరగతి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరుగుతుండగా, విద్య వ్యాపార సామ్రాజ్యంగా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఆరోపణలపై విచారణకు వెళ్లిన అధికారులు సైతం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, భారీ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్య సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులోకి వస్తేనే నిజమైన సంస్కరణల ఫలితాలు కనిపిస్తాయని వారు పేర్కొంటున్నారు.
