*ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ బాలికల కబడ్డీ పోటీలు…
*ఆకట్టుకున్న రాష్ట్ర వైభవాన్ని చాటిచెప్పేలా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు…
*క్రీడాకారులను ఉత్సాహపరిచేలా కబడ్డీ ఆడిన మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ…
గుడివాడ, జనవరి 19 : గత పాలనలో క్యాసినో గేమ్స్ కు నిలయమైన గుడివాడలో దేశంలోని చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించేలా జాతీయ కబాడీ పోటీలు జరుగుతుండడం మార్పుకు నిదర్శనమని కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జాతీయ స్థాయి పోటీలు జరగడం కృష్ణా జిల్లా ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ – 14 బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి మంత్రి వాసంశెట్టి శుభాష్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. ముందుగా ఏలూరు రోడ్డులోని హోమియో కళాశాల నుండి ఎమ్మెల్యే రాము క్రీడాజ్యోతి, క్రీడాకారులు జాతీయ జెండాలను, చేతబూనీ పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్,మంత్రి జాతీయ జెండాను ఎగురవేశారు.
పోలీస్ బ్యాండ్ మధ్య మార్చ్ ఫాస్ట్ చేస్తూ మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల, యార్లగడ్డ, అధికార, అనధికార ప్రముఖులకు క్రీడాకారులు గౌరవ వందనం చేశారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర వైభవాన్ని చాటి చెప్పేలా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తొలి రోజు తెలంగాణ – నవోదయ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించగ, 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ముందుగా క్రీడాకాలను ఉత్సాహపరిచేలా ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావులతో కలిసి మంత్రి సుభాష్ కబడ్డీ ఆడారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రి సుభాష్ పోటాపోటీగా రైడ్ పాయింట్లు సాధించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ…, గత ప్రభుత్వంలో జగన్ పబ్జి గేమ్ ఆడుకుంటే, గుడివాడలో క్యాషినో నిర్వహించేవారని, అలాంటి గుడివాడలో జాతీయ పోటీలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. అందరం గర్వంగా చెప్పుకునేలా కృష్ణాజిల్లా ప్రతిష్టను చాటి చెప్పేలా జాతీయ పోటీలు జరుగుతుండడం సంతోషకరమన్నారు. ఇంత గొప్పగా పోటీలు నిర్వహిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే రాము, నిర్వహకులను మంత్రి సుభాష్ అభినందించారు. క్రమ శిక్షణ, ఆత్మ విశ్వాసం, ఐక్యతను చాటి చెప్పేలా పోటీలో క్రీడాకారులందరూ పాల్గొవాలన్నారు. జాతీయ రాణించి, అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనాలని క్రీడాకారులకు మంత్రి సుభాష్ ఆశీస్సులు అందించారు. పాఠశాల దశనుండే దేశంలో చిన్నారుల ప్రతిభ గుర్తించేలా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…, వివిధ రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు స్వాగతం పలికారు.క్రీడాకారులందరూ, ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. స్వరాష్ట్రానికి వెళ్లిన తర్వాత కూడా గుడివాడను మర్చిపోనీ విధంగా, క్రీడాకారులకు ఆతిథ్యం ఇస్తామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. గ్రామీణ క్రీడల అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ నిర్మించిన ఈ స్టేడియంలో, జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. గుడివాడలో జాతీయ పోటీల నిర్వహణ సామర్థ్యం ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ చాలెంజ్ గా తీసుకొని అవకాశం ఇవ్వాలని మంత్రి లోకేష్ ను కోరగా ఆయన అనుమతించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. నేడు గొప్పగా ఈవెంట్ ప్రారంభం కావడం, గుడివాడ సామర్థ్యానికి నిదర్శనం అని అన్నారు. గుడివాడ ప్రజలు క్రీడలకు ప్రాధాన్యతనీస్తూ, ప్రేక్షకులుగా స్టేడియానికి వచ్చి, మంచి జట్లకు మద్దతునివ్వాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని జాతీయ పోటీలను గుడివాడలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ…, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నడయాడిన నేలపై జాతీయ పోటీలు జరగడం సంతోషకరమన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలన్నారు. అంతిమంగా కబడ్డీ విజయం సాధించేలా క్రీడాకారులందరూ పోటీల్లో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్, డీ.ఎస్పీ ధీరజ్ వినిల్, DEO సుబ్బారావు, రూరల్ ,నందివాడ మండల టిడిపి నేతలు వాసే మురళి, దానేటి సన్యాసిరావు, పండ్రాజు సాంబయ్య, అధ్యక్షులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి భానుమూర్తి, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల క్రీడాధికారులు ఝాన్సీ లక్ష్మి, కోటేశ్వరరావు, నేషనల్ గేమ్స్ ఫీల్డ్ ఆఫీసర్ నెట్వర్ సింగ్, వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు, కోచ్ లు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ సభ్యులు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు, క్రీడా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
