కొత్తగూడెం కార్పోరేషన్ తొలి పాలక మండలి కొలువుదీరింది – మేయర్‌గా మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా లలిత కుమారి

కొత్తగూడెం కార్పోరేషన్ తొలి పాలకవర్గం అధికారికంగా కొలువుదీరింది. 20వ డివిజన్‌కు చెందిన మూడ్ గణేష్ మేయర్‌గా, 8వ డివిజన్‌కు చెందిన సిరిపురపు లలిత కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరావు కార్పోరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించగా, అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. సిపిఐ కార్పోరేటర్ అడుసుమిల్లి సాయిబాబా మూడ్ గణేష్ పేరును ప్రతిపాదించగా, స్వతంత్ర కార్పోరేటర్ కంభంపాటి దుర్గాప్రసాద్ బలపరిచారు. డిప్యూటీ మేయర్‌గా లలిత కుమారి పేరును కనుకుంట్ల శ్రీనివాస్ ప్రతిపాదించగా, బోయిన విజయ్ కుమార్ మద్దతు తెలిపారు.

ఎన్నికల ఫలితాల నాటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సిపిఐ, కాంగ్రెస్ పార్టీలకు సమాన సీట్లు రావడంతో మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొనగా, ఇరు పార్టీల అగ్రనాయకత్వం చర్చల అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని చెరో రెండున్నరేళ్లుగా పంచుకోవాలని నిర్ణయించింది. ఒప్పందం ప్రకారం తొలి రెండున్నరేళ్లు మేయర్‌గా మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా లలిత కుమారి బాధ్యతలు స్వీకరించారు. మిగతా రెండున్నరేళ్లు మేయర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ మేయర్ పదవి సిపిఐకి దక్కనుంది.

ఇదిలా ఉండగా, బిఆర్ఎస్‌కు చెందిన ఎనిమిది మంది కార్పోరేటర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు. వారు తదుపరి రోజున ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఇరు పార్టీల నేతలు కార్పోరేటర్లతో సమావేశమై ఒప్పంద వివరాలు వెల్లడించారు. అనంతరం ర్యాలీగా కార్పోరేషన్ కార్యాలయానికి చేరుకోవడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది.

కార్పోరేషన్ కార్యాలయ ప్రాంగణం నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అభిమానులతో జనసంద్రమైంది. ప్రమాణస్వీకారం అనంతరం నినాదాలు, అభినందనల మధ్య కొత్త పాలకవర్గానికి ఘన స్వాగతం లభించింది.

WhatsApp Join Now
Youtube Subscribe