హైదరాబాద్లో అత్తపూర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు నిరసనగా కొత్తగూడెం న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించారు. ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఫర్ తెలంగాణ ఇచ్చిన పిలుపు మేరకు కొత్తగూడెం బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉపాధ్యక్షులు జనపరెడ్డి గోపి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
అనంతరం కోర్టు గేట్ బయట న్యాయవాదులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, న్యాయవాదుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని గోపి కృష్ణ డిమాండ్ చేశారు. న్యాయవాదులకు సంరక్షణ చట్టం అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ నిరసనలో న్యాయవాదులు హన్మంతరావు, చిరంజీవి రావు, పి. నాగేశ్వరరావు, కే. పుల్లయ్య, మన్మోహన్, యెర్రాపాటి కృష్ణ, శ్రీధర్, మహమ్మద్ సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. సంఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.
