కేంద్ర బడ్జెట్–2026 | ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దిశకు బలమైన పునాది

(రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను కేంద్రంగా ఉంచుకొని, దూరదృష్టి మరియు విజన్‌తో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్‌లో కీలక విధాన నిర్ణయాలు)

— తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఫిబ్రవరి 01: విక్షిత్ భారత్ – విజన్ 2047 సాకారానికి పునాది వేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్–2026 దేశ భవిష్యత్‌కు స్పష్టమైన మార్గదర్శకంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ భావనకు మరింత బలం చేకూర్చుతూ, యువశక్తి, నారీశక్తి, రైతులు, ఎస్సీ–ఎస్టీ–బీసీ వర్గాలు, దివ్యాంగులు, ఎంఎస్ఎంఈలు కేంద్రంగా రూపొందిన ఈ బడ్జెట్ దేశ ఆర్థిక ప్రయాణాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.

ద్రవ్యలోటును నియంత్రిస్తూ, మౌలిక వసతులు, పరిశ్రమలు, టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలకు సమతుల్య ప్రాధాన్యం ఇవ్వడం భవిష్యత్ తరాలకు బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసానికి ఈ బడ్జెట్ పునరుద్ధరణ అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బడ్జెట్‌తో విశేష లాభాలు

కేంద్ర బడ్జెట్–2026లో ఆంధ్రప్రదేశ్‌కు అనేక రంగాల్లో స్పష్టమైన అవకాశాలు లభించడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజా మూలధన వ్యయానికి రూ.12.2 లక్షల కోట్ల కేటాయింపు, కొత్త ఫ్రైట్ కారిడార్లు, జాతీయ జలమార్గాల విస్తరణ, సముద్ర విమానాల ప్రోత్సాహం వంటి నిర్ణయాలు ఏపీ లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు. విశాఖపట్నం–కాకినాడ పోర్ట్ కారిడార్‌ను ఆగ్నేయాసియా వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా తీర్చిదిద్దే అవకాశాలు ఈ బడ్జెట్‌తో మరింత విస్తరించాయని చెప్పారు.

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు రూ.3,320 కోట్ల కేటాయింపు ద్వారా రాష్ట్ర వ్యవసాయం, నీటి భద్రతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యం స్పష్టమైందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది రైతులకు శాశ్వత సాగునీటి భరోసా లభిస్తుందని తెలిపారు.

పరిశ్రమలు, అరుదైన ఖనిజాలు, టెక్నాలజీకి ఊపిరి

ఆంధ్రప్రదేశ్‌ను అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) కారిడార్ రాష్ట్రంగా కేంద్ర బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొనడం చారిత్రాత్మక నిర్ణయమని పల్లా అన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, విలువ జోడింపు రంగాల్లో భారీ పెట్టుబడులకు ఇది దారి తీస్తుందన్నారు. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు మూడు కెమికల్ పార్కుల ఏర్పాటు, ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించడం ఏపీకి పెద్ద అవకాశమన్నారు.

ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీకి రూ.40 వేల కోట్ల కేటాయింపు, సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 ద్వారా పరికరాలు, మెటీరియల్స్ తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం శ్రీ సిటీ వంటి ఏపీ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లకు మేలు చేస్తుందన్నారు. టన్నెల్ బోరింగ్ యంత్రాలు, అత్యాధునిక అగ్నిమాపక పరికరాల దేశీయ తయారీ కూడా మౌలిక వసతుల రంగంలో స్వయం సమృద్ధిని పెంచుతుందన్నారు.

బయోఫార్మా, హెల్త్‌కేర్, మెడికల్ ఎడ్యుకేషన్‌లో కొత్త దశ

రూ.10 వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకం ప్రారంభించడం ద్వారా భారత్‌ను గ్లోబల్ బయాలజిక్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగు పడిందని పల్లా తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగానికి ఇది కొత్త ఊపునిస్తుందన్నారు. ప్రాంతీయ మెడికల్ విలువ పర్యాటక హబ్‌లు, మిత్ర వైద్య సిబ్బంది (అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్) శిక్షణ ద్వారా ఏపీ హెల్త్‌కేర్ వర్క్‌ఫోర్స్‌కు ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

పర్యాటకం, సేవారంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం

అరకు లోయను పర్యావరణ అనుకూల పర్వత మార్గాలుగా, పులికాట్ సరస్సును బర్డ్ వాచింగ్ ట్రెయిల్స్‌తో అభివృద్ధి చేయడంపై బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టడం స్థానిక ఉపాధి అవకాశాలను పెంచుతుందని పల్లా పేర్కొన్నారు. జాతీయ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ద్వారా పర్యాటక కంటెంట్ సృష్టి, డిజిటల్ టూరిజం ఉద్యోగాలు పెరుగుతాయన్నారు.

మత్స్యకార రంగంలో 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి, తీరప్రాంత మత్స్యకార విలువ శృంఖల బలోపేతం చేయడం ద్వారా దేశంలోనే అతిపెద్ద సముద్ర ఆహార ఎగుమతిదారైన ఆంధ్రప్రదేశ్‌కు మరింత మేలు జరుగుతుందన్నారు. కొబ్బరి, జీడిపప్పు, కోకో వంటి అధిక విలువ పంటలపై ప్రత్యేక కార్యక్రమాలు తీరప్రాంత రైతుల ఆదాయాన్ని పెంచుతాయని తెలిపారు.

యువశక్తి, నారీశక్తి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం

రూ.10 వేల కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ద్వారా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా నిలవడం ఉపాధి కల్పనకు కీలకమని అన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల విస్తరణ, ఏవీజీసీ, గేమింగ్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో అవకాశాలు భవిష్యత్ టెక్నాలజీలకు యువతను సిద్ధం చేస్తాయన్నారు. నారీశక్తి సాధికారత, దివ్యాంగులకు అనేక కార్యక్రమాలు సామాజిక సమానత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

మౌలిక వసతులు, నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం

టియర్–2, టియర్–3 నగరాల్లో సిటీ ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధికి ప్రతి నగరానికి ఐదేళ్లలో రూ.5,000 కోట్ల చొప్పున కేటాయింపులు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలను ఆర్థిక వృద్ధి కేంద్రాలుగా మార్చుతాయని తెలిపారు. రాష్ట్రాలకు రూ.25.43 లక్షల కోట్ల వనరుల బదిలీ, 16వ ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలు, విపత్తు నిర్వహణకు నిధులు జిల్లా స్థాయి పాలనను బలోపేతం చేస్తాయని అన్నారు.

విక్షిత్ భారత్ దిశగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర

కేంద్ర బడ్జెట్–2026 కేవలం ఖర్చుల ప్రకటన కాదు, దేశ భవిష్యత్‌కు విధానపరమైన దిశానిర్దేశం చేసే పత్రంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, బయోఫార్మా, ఏఐ, డేటా సెంటర్లు, పర్యాటకం, వ్యవసాయం అన్నింటినీ సమన్వయంగా ముందుకు తీసుకెళ్లే ఈ బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe