కడప నగరంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కృష్ణా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని రాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య, జిల్లా బలిజ సంఘం అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు మాట్లాడుతూ, శ్రీకృష్ణదేవరాయలు నేటి పాలకులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. రాయలసీమను రత్నాలసీమగా నిలబెట్టేలా ఆయన పాలన సాగించారని, ధైర్యసాహసాలు, న్యాయపాలనతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు.
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని పరిపాలన సాగించిన మహానేతగా శ్రీకృష్ణదేవరాయలు గుర్తింపు పొందారని తెలిపారు. సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలనే సందేశాన్ని ఆయన జీవితం అందిస్తోందని అన్నారు. మనమందరం రాయల అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టిడిపి మహిళా నాయకురాలు మురికిపాటి సునీతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
