క్వింటాకు రూ.8,768 కనీస మద్దతు ధరతో రైతులకు భరోసా – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య .
కంచికచర్ల మార్కెట్ యార్డు నందు శుక్రవారం నాడు ఏపీ మార్క్‌ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు ధరపై క్వింటాకు రూ.8,768లతో ఏర్పాటు చేసిన పెసలు కొనుగోలు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మార్కెట్ యార్డ్ పాలకవర్గం, రైతు నాయకులు, రైతులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కనీస మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ నాణ్యమైన పెసలను ధైర్యంగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటను విక్రయించుకునేలా అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అధికారులు రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ, వేగవంతమైన కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, దళారుల మోసాలకు తావు లేకుండా నేరుగా ప్రభుత్వం నుంచే మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ పాలకవర్గం, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నేతలు, వివిధ హోదాలు కలిగిన కూటమి నేతలు, మార్కెట్ యార్డు సిబ్బంది, రైతు నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
