ఏపీలో రైతులకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువులపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు వైద్య భారం తగ్గించేందుకు ప్రత్యేక పశు అంబులెన్స్‌లు, ఉచిత వైద్య శిబిరాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాడి పశువులే రైతుల ప్రధాన జీవనాధారం కావడంతో, అవి అనారోగ్యానికి గురైతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో పశు వైద్యశాలలు లేకపోవడం వల్ల దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది.
ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 300 పశు అంబులెన్స్‌లను సేవల్లోకి తీసుకువస్తోంది. ఇందులో 175 అంబులెన్స్‌లు 104 తరహాలో పనిచేస్తాయి. ఇవి రోజుకో గ్రామంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఉండి ఉచిత వైద్య సేవలు అందిస్తాయి. పశు వైద్యశాలలు లేని గ్రామాలకు 20 రోజులకు ఒకసారి ఈ అంబులెన్స్‌లు వెళ్లనున్నాయి.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై దాణా, మూడేళ్ల పాటు పశువులకు ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 31 వరకు శిబిరాలు కొనసాగుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.
