‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, మెగాస్టార్ చిరంజీవితో అనుభవం, జూనియర్ ఎన్టీఆర్‌తో స్నేహం, మహేష్ బాబుతో ఉన్న అనుబంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవికి కథ వినిపించేందుకు తాను ఎంసెట్, ఐసెట్‌లకంటే ఎక్కువగా సిద్ధమయ్యానని సరదాగా చెప్పారు. కథ నెరేషన్ సమయంలో చిరంజీవి పాత్రల ఎక్స్‌ప్రెషన్స్‌ను స్వయంగా పలికిస్తూ వినడం దర్శకులకు గొప్ప ప్రేరణనిస్తుందని అన్నారు.
ఎన్టీఆర్‌తో స్నేహం గురించి మాట్లాడుతూ, ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ సమయంలో లండన్, స్పెయిన్‌లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని తెలిపారు. ఎన్టీఆర్ ఎలాంటి భేదభావం లేకుండా అందరితో కలిసిపోయేవారని చెప్పారు. ఒకసారి తాను చెప్పిన కథ విని ఎన్టీఆర్ “ఈ కథ ఎక్కడో దొబ్బేశావ్ కదా” అని సరదాగా అన్నారని గుర్తుచేసుకున్నారు. అదే తనకు దక్కిన గొప్ప ప్రశంసగా బుచ్చిబాబు పేర్కొన్నారు.
