పార్వతీపురం మన్యం: జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ వార్షిక థియరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. గత కొద్ది నెలలుగా విద్యార్థులు చేసిన కృషికి ఫలితం అందుకునే సమయం ఆసన్నమైందని పేర్కొంటూ, ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివి, సమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ సమాధానాలు రాయాలని కోరారు.
పరీక్షా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ, క్రమశిక్షణతో వ్యవహరించాలని హితవు పలికిన కలెక్టర్, పరీక్షలు సజావుగా సాగేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు, పోలీసు యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా, వారికి మానసిక ధైర్యం అందించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులందరూ శతశాతం ఉత్తీర్ణత సాధించి, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
