రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్యం, ప్రయాణ భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్.ఆర్.సి, ఎన్.ఎస్.ఎస్, ఎస్.ఏ.ఎస్.ఏ విభాగాల సంయుక్త సహకారంతో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి.
నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అల్బెండజోలు మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, నులిపురుగుల వల్ల కలిగే రక్తహీనత వంటి సమస్యలను నివారించేందుకు ఈ మాత్రలు ఉపయోగకరమని వివరించారు. “ఆరోగ్యాంధ్ర” లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి విద్యార్థి సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. యువత వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. కార్యక్రమం భాగంగా కె. బుడగుంటపల్లె గ్రామంలో పర్యటించి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై చైతన్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ దాసరి మోషే, డాక్టర్ ఇ. ప్రేమలత, శ్రీ డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని కార్యక్రమానికి విశేషంగా సహకరించారు.
