కృత్రిమ మేధ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికా సంస్థ Anthropic ఇప్పుడు భారత్‌లో ట్రేడ్‌మార్క్ వివాదంతో చర్చనీయాంశమైంది. ఇదే పేరుతో కర్ణాటకలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ ఐటీ సంస్థ Anthropic Software Private Limited కోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారానికి కేంద్రబిందువైంది.
భారత సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయ్యజ్ ముల్లా, తమ బ్రాండ్ పేరును అమెరికా కంపెనీ వినియోగించడం వల్ల వ్యాపార నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ బెళగావి కమర్షియల్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు అమెరికా సంస్థ ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 16న హాజరు కావాలని ఆదేశించినప్పటికీ గైర్హాజరవడంతో, మార్చి 9కు మరోసారి పిలుపునిచ్చింది.
2017లో స్థాపించబడిన భారతీయ సంస్థ, విద్య, కనెక్టివిటీ, సేఫ్టీ వంటి రంగాల్లో డిజిటల్ సొల్యూషన్లు అందిస్తున్నట్లు తెలిపింది. “మా కస్టమర్లకు ‘ఆంథ్రోపిక్’ పేరే తెలుసు. కానీ నెట్టింట వెతికితే anthropic.comకు దారి తీస్తోంది. దీంతో మేం గుర్తింపు కోల్పోతున్నాం,” అని అయ్యజ్ ముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా సంస్థ 2021లో ప్రారంభమైనప్పటికీ, అదే పేరును ఉపయోగించడం గందరగోళానికి దారితీస్తోందని ఆయన అభిప్రాయం.
ఇక అమెరికా Anthropic ఇటీవల విడుదల చేసిన క్లాడ్ ఏఐ టూల్స్‌తో టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. బెంగళూరులో కార్యాలయం ప్రారంభించడం, భారత టెక్ దిగ్గజం Infosys తో భాగస్వామ్యం వంటి పరిణామాలు ఈ పేరును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో పేరుపై న్యాయపోరాటం ఎలా మలుపుతీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
