అమరావతి పర్యటనలో బిల్ గేట్స్ – స్వర్ణాంధ్ర@2047 విజన్‌కు సాంకేతిక మద్దతు

అమరావతి పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులతో కలిసి స్వర్ణాంధ్ర@2047 విజన్‌కు సంబంధించిన కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రాజెక్ట్ సంజీవని, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వ్యవసాయం, విద్యా మరియు ప్రజారోగ్య రంగాల్లో చేపడుతున్న ఆవిష్కరణాత్మక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష జరిగింది.

ప్రజలకు ఆర్టీజీఎస్ ద్వారా అందిస్తున్న సేవల సామర్థ్యం, పారదర్శకత, వేగవంతమైన పరిపాలన గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ సంజీవని అమలుకు గేట్స్ ఫౌండేషన్ తరఫున ఏఐ సాంకేతిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చర్చా కార్యక్రమంలో వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు ప్రత్యక్షంగా పాల్గొనగా, రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానమయ్యారు. జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి. రామారావు తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ పర్యటన రాష్ట్ర సాంకేతిక, పరిపాలనా దిశలో కీలక అడుగుగా నిలిచింది.

WhatsApp Join Now
Youtube Subscribe