అభివృద్ధి–సంక్షేమాల సమతుల్యం బడ్జెట్ – డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ అభినందనలు

శృంగవరపుకోట, ఫిబ్రవరి 14: రాష్ట్ర బడ్జెట్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకుని అభివృద్ధి, సంక్షేమాల మేళవింపుగా కనిపిస్తోందని విజయనగరం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌పై స్పందించిన ఆయన, అన్ని రంగాలకు మరియు అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించటం అభినందనీయమన్నారు.

వెనుకబడిన వర్గాల సంక్షేమానికి భారీ కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా బీసీ కాంపోనెంట్ కోసం రికార్డు స్థాయిలో ₹51,021 కోట్లు కేటాయించటం, అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెంచిన నిధులు సామాజిక న్యాయానికి సంకేతమన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టే దిశగా “నేతన్నకు ఉచిత విద్యుత్” పథకం ప్రకటించడం ముఖ్యమంత్రి ధృఢ సంకల్పాన్ని చాటుతోందని తెలిపారు.

గృహ నిర్మాణ శాఖకు ₹6,350 కోట్లు కేటాయించడం ద్వారా పేదల సొంతింటి కల సాకారం అవుతుందని, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ₹13,546 కోట్లు కేటాయించడం మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ దృష్టిని వెల్లడిస్తోందన్నారు. రాజధాని అమరావతికి ₹6,000 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹18,224 కోట్లు, పోలవరానికి ప్రత్యేకంగా ₹6,105 కోట్లు కేటాయించడం ద్వారా కీలక ప్రాజెక్టులు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యా, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యం, వ్యవసాయానికి పెరిగిన కేటాయింపులు, రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు భారీ నిధులు రైతుల సంక్షేమానికి దోహదపడతాయని గొంప కృష్ణ పేర్కొన్నారు. విశాఖ ప్రాంతీయ ఆర్థిక జోన్‌కు ₹28,000 కోట్లు కేటాయించడం, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించే చర్యలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe