- దాదాపు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతుల ఆవేదన
- క్షేత్రస్థాయిలో పరిశీలించిన రెవెన్యూ, ఉద్యాన, అటవీ శాఖ అధికారులు
చిట్వేలు, జనవరి 12 ఎల్లో సింగం ప్రతినిధి
చిట్వేలు మండలంలో అడవి పందులు వీరవిహారం చేశాయి. పంట పొలాలపై దాడి చేసి సుమారు 7 వేల బొప్పాయి మొలకలను నాశనం చేయడంతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు.చిట్వేలు మండలం కె. కందులవారిపల్లి గ్రామం సమీపంలోని పొలాల్లో రైతులు ఎంతో శ్రమించి దుక్కి దున్ని, డ్రిప్పు పైపులు ఏర్పాటు చేసి బొప్పాయి మొలకలను నాటారు. అయితే, అడవి పందుల మందలు ఈ పొలాలపై దాడి చేసి మొలకలను కొరికి పూర్తిగా ధ్వంసం చేశాయి. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటంతా నాశనమైందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గ్రామానికి చెందిన కందుల శంకరయ్య, కందుల ఈశ్వరయ్య, కందుల మురళి, కందుల లక్ష్మమ్మ, కందుల రెడ్డమ్మలకు చెందిన పొలాల్లో ఈ నష్టం వాటిల్లింది.ఒక్కో మొలకను రూ. 32 చొప్పున మొత్తం 7 వేల మొలకల కోసం రూ. 2,24,000 ఖర్చు చేశారు.దుక్కులు దున్నడానికి, కూలీలకు మరియు ఇతర ఖర్చులతో కలిపి దాదాపు నాలుగు లక్షల రూపాయల వరకు నష్టపోయినట్లు రైతులు తెలిపారు.సమాచారం అందుకున్న అధికారులు పొలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేశారు. గ్రామ రెవెన్యూ అధికారి బాలసుబ్రమణ్యం, గ్రామ సచివాలయ ఉద్యాన శాఖ సహాయకురాలు శివాత్మిక మరియు అటవీ శాఖ ప్రతినిధి శ్రీనివాసులు పంట నష్టాన్ని పరిశీలించారు.ఎంతో పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట అడవి పందుల పాలవ్వడంతో, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
