సత్యసాయి బాబా ప్రేరణతో ప్రేమ, సేవను జీవన విధానంగా తీసుకున్న బొబ్బిలి సత్యసాయి సేవా సమితి భక్త బృందం మానవీయతను చాటుకుంది. కేరళకు చెందిన చక్రపాణి ప్రమాదవశాత్తు పడిపోవడంతో తుంటే కీలు తప్పి నడవలేని స్థితిలో ఉండగా, కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె.సి. రాజు, పాత్రికేయుడు రేఖా తవుడు వైద్యులను సంప్రదించారు.
ఎముకల వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించగా, ఖర్చులు సుమారు రూ.60వేలు అవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జె.సి. రాజు విజ్ఞప్తిపై స్పందించిన సేవా సమితి కన్వీనర్ లక్ష్మణరావు, రామి నాయుడు, భాస్కరరావు తదితర భక్తులు విరాళాలు సేకరించి రూ.20వేలు నగదును ఆదివారం సత్యసాయి ధ్యాన మందిరంలో అందజేశారు.
ఈ సాయంతో చికిత్సకు అవసరమైన నిధులు సమకూరుతున్నాయని పేర్కొంటూ సేవా సమితి కార్యవర్గానికి, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కారుణ్య ఫౌండేషన్ ప్రతినిధులు జి.సి.హెచ్.జి. శర్మ, చినమ్ములు, రాము తదితరులు పాల్గొన్నారు.
