గుమ్మలక్ష్మిపురం: జిల్లాను బాల్య వివాహరహితంగా తీర్చిదిద్దేందుకు సమాజం మొత్తం చేయి చేయి కలుపుకొని ముందుకు సాగాలని జిల్లా రెండవ అదనపు జడ్జి దామోదర్ రావు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమంలో బాల్య వివాహ విముక్తి రథాన్ని ఆయన ప్రారంభించారు. పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని పేర్కొన్నారు.
అప్ హోల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రచార రథం గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల దుష్పరిణామాలు, చట్టపరమైన నిబంధనలపై ప్రజలకు చైతన్యం కల్పించనుంది. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఇటువంటి వివాహాలను అడ్డుకోవడంలో కుటుంబాలు, యువత, స్థానిక నాయకులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. చట్టాలను గౌరవిస్తూ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమస్యకు చెక్ పెట్టగలమన్నారు.
అదేవిధంగా, బాల్య వివాహాలపై సమాచారం అందించేందుకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ 181, పోలీస్ హెల్ప్ లైన్ 121 నెంబర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాసరావు, తహశీల్దార్ ఎన్. శేఖర్, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, సీనియర్ అడ్వకేట్లు, పోలీసు అధికారులు, గ్రామ సెక్రటరీలు, వీఆర్వోలు, మహిళా సంరక్షణ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన దిశగా సమిష్టి కృషి కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు.
