పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 73 వినతులు అందాయి. వీటిలో 25 వినతులు రెవిన్యూ శాఖకు, మిగతా 48 వినతులు ఇతర సమస్యలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు. సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్. దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు.
సాధారణ సమస్యల విభాగంలో, కురుపాం కేటీఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన మీసాల జ్యోతి తనకు రావలసిన “తల్లికి వందనం” నగదు వేరే ఖాతాలో జమైందని ఫిర్యాదు చేశారు. పెదబొండపల్లి ఎస్సీ కాలనీకి చెందిన నత్తల అశ్విత్ సికిల్ సెల్ ఎనిమియా పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. తాళ్లబురుడి నుంచి సురాపాటి సోములు బాలికా సంరక్షణ పథకం బాండ్ల మెచ్యూరిటీ నగదు అందలేదని తెలిపారు.
రెవిన్యూ సమస్యలలో, లక్ష్మీపురం నుంచి మండంగి సుశీల డి-పట్టా స్థలం ఆక్రమణ తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గరుగుబిల్లి వినయ్ బాబు భూమి పంపకాల కోసం మరణ ధ్రువీకరణ పత్రం కోరగా, చిలకాం నుంచి దాసరి సత్తమ్మ భూములను జిరాయితీగా మంజూరు చేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
