జగన్ కు సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం
*విజయవాడ: ఎల్లో సింగం రిపోర్టార్
కోట్లమంది భక్తుల ఆరాధ్య దైవం తిరుపతి వెంకన్న లడ్డూ ప్రసాదాలలో కల్తీపై చర్చించేందుకు ధైర్యం ఉంటే, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గురునానక్ కాలనీలోని విజయవాడ ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లడ్డూలో పాల చుక్క కొనని కంపెనీల నుంచి రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవుని సొమ్మును లూఠీ చేశారని సిట్ దర్యాప్తులో తేలితే, తేలు కుట్టిన దొంగల్లా నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చిందంటూ డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని అన్నారు. 59 లక్షల 71 వేల కిలోల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూల తయారీ పాపం మీది కాదా? అని ప్రశ్నించారు. హవాలా పద్దతిలో ఏజెంట్లను నియమించి కల్తీ నెయ్యి సేకరించారని, తద్వారా
రూ. 234 కోట్లు దోచారని, టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిఎ చిన్నప్ప ఖాతాలో రూ. 4 కోట్ల 85 లక్షలు ఉన్నాయని ఆరోపించారు. భరత్ భాయ్ ఠాకూర్ అనే ఏజెంట్ ద్వారా విజయవాడ ప్రాంతంలోని వైసీపీ నాయకులకు కూడా రూ. 12 కోట్ల 55 లక్షలు అందాయని తెలిపారు. వీటిలో వైకాపా నాయకులు తలశిల రఘురాం, దేవినేని అవినాష్, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు వాటాలు ఎంతో తేలాలని పేర్కొన్నారు. గత ఐదేళ్ళు హూ కిల్డ్ బాబాయి అంటే వైసీపీ నాయకులు ఒక్కరూ సమాధానం చెప్పలేదని, ఇప్పుడైనా హూ ఘీ చీటర్స్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ విచారణలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కల్తీ దొంగలు ప్రభుత్వం పై నిందలు వేస్తూ రెచ్చి పోతున్నారని, తప్పు చేసిన వారికి ఎదురు దాడి చేయటం తప్ప మరో మార్గం ఏముంటుంది? అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పుకు దేవదేవుని సన్నిధిలో పశ్చాత్తాపం చెందాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.
