భర్తను జైలు నుంచి బెయిల్‌పై బయటకు తీసుకొచ్చిన భార్యే అతడిని హత్య చేయించిన ఘటన మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లె సమీపంలోని అంకాలమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. దోర్నాలకు చెందిన అడపాల లాలశ్రీను ఇటీవల గంజాయి కేసులో ఒంగోలు జైలులో ఉండగా, బుధవారం బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడిని ఇంటికి తీసుకొస్తున్న మార్గమధ్యంలో భార్య ఝాన్సీ, బావమరిది అశోక్‌లు మరికొందరితో కలిసి ఘాతుకానికి పాల్పడ్డారు.
సాయంత్రం సమయంలో రోడ్డుపక్కన ఆగిన లాలశ్రీను కళ్లలో కారంపొడి చల్లి, కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుడి తల్లి సుబ్బమ్మ, కోడలు ఝాన్సీకి అక్రమ సంబంధం ఉందని, తన కొడుకును అడ్డు తొలగించుకునేందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనతో మనవళ్లు అనాధలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ, కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.
