రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవనిగడ్డ సర్కిల్ పోలీసులు వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే డేంజర్ జోన్ వద్ద ప్రమాదంలో ధ్వంసమైన కారును ఏర్పాటు చేసి వాహనదారులకు హెచ్చరిక సందేశం అందించారు. ఆ మార్గంలో ప్రయాణించే డ్రైవర్లు ప్రత్యక్షంగా ప్రమాద తీవ్రతను గ్రహించేలా ఈ చర్యలు తీసుకున్నారు.
“జాగ్రత్త గురూ.. చూశారా కారు!” అనే ఆకట్టుకునే సందేశంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. వేగ నియంత్రణ, జాగ్రత్తగా డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల పాటన ఎంత ముఖ్యమో గుర్తుచేసే ఉద్దేశంతో పోలీసులు ఈ ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రమాదాలకు కారణమయ్యే నిర్లక్ష్య డ్రైవింగ్‌పై అప్రమత్తత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాత్రివేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా కారుపై రేడియం స్టిక్కర్లు అతికించి అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని చూసిన వాహనదారులు వేగం తగ్గిస్తూ జాగ్రత్తగా ప్రయాణించడం గమనార్హం. ప్రజల్లో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు పోలీసులు చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమం ప్రశంసలు అందుకుంటోంది.
